
- కూత ఖో-ఖోది.. కీర్తి తెలంగాణది
- తాండూరు నుంచి జాతీయ వేదికపైకి ‘అక్షర’ విద్యార్థిని పరుగు
- తొమ్మిదో తరగతిలోనే తల్లిదండ్రులకు, జిల్లాకు గర్వకారణం
జనవాహిని ప్రతినిధి తాండూరు : గాలిలో తేలిపోయే పాదాలు.. లక్ష్యాన్ని ఛేదించే చూపులు.. అలసిపోని ఉత్సాహం! ఈ అరుదైన లక్షణాలన్నీ కలిపితే కె. శ్రీలక్ష్మి. అక్షర హైస్కూల్ తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ క్రీడా ధీర తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయి ఖో-ఖో మైదానంలో నిలబెట్టడానికి సిద్ధమైంది! ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణ అండర్-14 ఖో-ఖో జట్టుకు ఎంపికైన శ్రీలక్ష్మి, తాండూరు క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జట్టు రన్నరప్‌గా నిలవడంలో ఆమె శ్రమ, ప్రతిభ వెలకట్టలేనిది. ఈ అరుదైన ఘనతపై పాఠశాల ప్రిన్సిపాల్ మోహన కృష్ణ గౌడ్ ఆనందం వ్యక్తం చేస్తూ, “మా శ్రీలక్ష్మి దేశవ్యాప్తంగా తాండూరు పేరును మారుమోగించడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన పీఈటీలు రవీందర్ రెడ్డి మరియు గోపాల్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చిన్ననాటి కలను సాకారం చేసుకుంటూ, జాతీయ పోటీల్లో మెరిసి, తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి కావాలని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు.



