- తాండూరులో యథేచ్ఛగా ఇసుక, మట్టి మాఫియా
- ప్రభుత్వ భూములు, పాఠశాల స్థలాలూ కబ్జా..
- డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో అక్రమ వసూళ్లు
- కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్ కౌన్సిలర్ విమర్శలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదనలో మునిగితేలుతున్నారని బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డ్ కౌన్సిలర్ విమర్శలు చేశారు. శనివారం అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ…..కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యమని, ప్రజల దృష్టి మరల్చేందుకే ఇతరులపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.తాండూరు లో ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా మాఫియాను తలపిస్తోందని ఇర్షాద్ ఆరోపించారు. రాత్రి సమయాల్లో యథేచ్ఛగా ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయని, వీటి వెనుక కాంగ్రెస్ ముఖ్య నేతల హస్తం ఉందని విమర్శించారు. చెక్‌పోస్టులు, రాయల్టీ ల వద్ద పేరుపేరునా వసూళ్లకు పాల్పడుతున్నారని, దీనికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని హెచ్చరించారు. పట్టణంలోని ప్రభుత్వ భూములపై కాంగ్రెస్ నేతలు కబ్జా కోరలు చాస్తున్నారని బీఆర్ఎస్ ఇర్షాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ప్రభుత్వ పాఠశాల స్థలాలను కూడా వదలకుండా ఆక్రమణలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా తాండూరు మారుతోందని ఆయన ఆరోపించారు.అదేవిదంగా….పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలని బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని, కానీ నేడు కాంగ్రెస్ నాయకులు ఆ ఇళ్లను ఆశ చూపి ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇళ్లపై వ్యాపారం చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని, ఇక్కడి ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఇర్షాద్ తెలిపారు. రాబోయే రోజుల్లో అక్రమార్కులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, తమ వద్ద ఉన్న ఆధారాలతో కాంగ్రెస్ నాయకుల బండారాన్ని బయటపెడతామని ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ హెచ్చరించారు.



