Sunday, March 8, 2026

షోకేస్ బోమ్మలుగా ట్రాఫిక్ సిగ్నల్స్…!

-

spot_img
  • ట్రాఫిక్ సిగ్నల్స్ షోకేస్ బొమ్మలేనా?
  • ఐదేళ్లుగా వెలగని సిగ్నల్ దీపాలు
  •  పట్టించుకోని పాలకులు, అధికారులు
  •  నరకప్రాయంగా మారుతున్న పట్టణ ట్రాఫిక్

జానవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పరిస్థితి “దీపం ఉన్నా వెలుగు లేని” చందంగా మారింది. 2018-19 కాలంలో లక్షలాది రూపాయలతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, కేవలం కొద్దిరోజులకే పరిమితమయ్యాయి. ప్రారంభించిన కొన్నాళ్లకే సాంకేతిక లోపాలతో ఆగిపోయిన ఈ సిగ్నల్స్, ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ పునరుద్ధరణకు నోచుకోకపోవడం గమనార్హం.
పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లు ఇప్పుడు కేవలం ఇనుప స్తంభాలుగా, అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. నాటి నుండి నేటి వరకు వీటికి కనీస మరమ్మతులు కూడా చేయించలేదు. అప్పట్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అటకెక్కినట్ల కనిపిస్తోంది. రోజురోజుకు వాహనాల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతున్నా, సిగ్నల్ వ్యవస్థను పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
పట్టణానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, ప్రధాన కూడళ్లలో సిబ్బందిని ఉంచి ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. పోలీసులు ఉన్నప్పటికీ, సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనాల రాకపోకలు గందరగోళంగా మారుతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్స్ ఉదయం, సాయంత్రం సమయంలో పాదచారులు రోడ్డు దాటడం ప్రాణసంకటంగా మారుతోంది.
ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను మళ్ళీ ప్రారంభిస్తారా? లేక అలానే గాలికి వదిలేస్తారా?” అని పట్టణ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనుల గురించి మాట్లాడే ప్రజాప్రతినిధులు, కనీసం ఉన్న సిగ్నల్స్ రిపేరు చేయించలేకపోవడం విచారకరమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆగిపోయిన సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించాలని లేదా ఆధునిక హంగులతో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేసి పట్టణ ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని తాండూరు వాసులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories