Saturday, February 28, 2026

వైద్యులు లేని వేళ.. నర్సులే దిక్కు…!

-

spot_img
  • వైద్య సేవలు.. రెండున్నర గంటలే..! 
  • తాండూరు జిల్లా ఆస్పత్రిలో రోగులకు తప్పని పడిగాపులు
  • ఒక్కడే డాక్టర్.. మూడ్రోజుల డ్యూటీ
  • ప్రైవేటు ప్రాక్టీస్ ధ్యాసలో.. ప్రభుత్వ విధులకు కోత

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వాన్నంగా తయారయ్యాయి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్యులు విధులను గాలికొదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైద్యులు కేవలం రెండున్నర గంటలు మాత్రమే సేవలందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

సమయపాలన శూన్యం

ఉదయం 10 గంటల తర్వాత ఆస్పత్రికి రావడం, 11 లేదా 12 గంటలకే తిరుగుటపా కట్టడం కొందరు వైద్యులకు అలవాటుగా మారింది. వివిధ గ్రామాల నుంచి కష్టపడి వచ్చే రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే వైద్యులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు ప్రాక్టీస్‌పైనే మక్కువ!

ఆస్పత్రిలో పనిచేస్తున్న 31 మంది వైద్యుల్లో చాలామందికి పట్టణంలోనే సొంతంగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సమయం కేటాయించకుండా, తమ సొంత ప్రాక్టీస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని కిందిస్థాయి సిబ్బందే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మూడ్రోజుల డ్యూటీ: అత్యవసర విభాగంలో ఒకే వైద్యుడు వరుసగా మూడు రోజుల పాటు విరామం లేకుండా పనిచేయాల్సి వస్తోంది. నిద్ర లేకపోవడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.రాత్రి వేళల్లో వందల సంఖ్యలో రోగులు వస్తున్నా, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్ల అవతారం ఎత్తి చికిత్స అందిస్తున్నారు. రోజూ 500-600 మంది రోగులు వస్తున్నా, సరైన వైద్యం అందక ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, తాండూరు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories