మద్యం మత్తులో రెచ్చిపోయిన గ్యాంగ్..!

- పాత గొడవల నేపథ్యంలో వ్యక్తి హత్
- అడ్డువచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి
- హత్య కేసులో పోలీసుల వేగవంతమైన చర్యలు
- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర
జనవాహిని ప్రతినిధి తాండూరు : పాత గొడవలు ఒక ప్రాణాన్ని బలిగొన్నాయి. మద్యం మత్తులో ఉన్న ఒక ముఠా, తమ శత్రువును కాపాడే ప్రయత్నం చేసిన ఒక అమాయక వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటన యాలాల మండలంలోని రాజీవ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర వివరాలు వెల్లడించారు. రాజీవ్ కాలనీకి చెందిన కిట్టు అనే వ్యక్తి, ఖంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్‌తో గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. 15 రోజుల క్రితం కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి, నిందితుడు గోపాల్ తన అనుచరులతో కలిసి మద్యం మత్తులో కిట్టుపై దాడి చేసేందుకు వచ్చాడు.ప్రాణభయంతో కిట్టు పరుగెత్తుకుంటూ సమీపంలోని ఒక బీఫ్ షాపులోకి వెళ్లి, అక్కడ ఉన్న తన స్నేహితుడు అబు సోఫియాన్‌ను ఆశ్రయించాడు. అబు సోఫియాన్ తండ్రి నూర్ మహమ్మద్ ఖురేషి ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించగా, తీవ్ర ఆగ్రహానికి లోనైన గోపాల్ తన వద్ద ఉన్న కత్తితో ఖురేషి కడుపులో బలంగా పొడిచాడు.తీవ్రంగా గాయపడిన ఖురేషిని కుటుంబ సభ్యులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారని ఎస్పీ తెలిపారు.
ఏడుగురు నిందితుల అరెస్ట్..
ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర పేర్కొన్నారు. వారిలో ప్రధాన నిందితుడు మద్దూరి గోపాల్ (A1), ఆదర్శ్ (A2), అనిల్ (A3), ప్రవీణ్ (A4), కృష్ణ (A5), ప్రశాంత్ రెడ్డి (A6) మరియు ఒక మైనర్ (A7) ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకున్న నిందితులందరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం వ్యక్తిగత కక్షల వల్లే ఈ ఘర్షణ జరిగిందని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్నేహ మెహ్ర స్పష్టం చేశారు.





