NEWS

పట్టు కోల్పోతున్న కంచుకోట..?

  • తాండూరు ‘హస్తం’లో అంతర్మథనం..
  •  కంచుకోటలో కనిపిస్తోన్న బీటలు!
  • పార్టీలో ‘హావ’ లేక కేడర్ డీలా?
  • పట్నం ‘మౌనం’.. మమేకం వెనుక మర్మమేంటి?
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా మెరుగుపడేనా..?

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న తాండూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీకి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ప్రత్యర్థి పార్టీ ‘కారు’ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం అడుగులు వేయలేక తడబడుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీకి ఆశించిన స్థాయిలో ‘హావ’ ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.నియోజకవర్గంలోని కరణ్‌కోట్ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కావడం పార్టీకి కొంత ఊరటనిచ్చినప్పటికీ, అది కేవలం స్వల్ప సంతోషంగానే మిగిలిపోయింది. ఏకగ్రీవాలు జరిగిన చోట కూడా పార్టీకి రావాల్సిన మైలేజ్ రాకపోవడం, ప్రజల్లో అధికార పార్టీపై ఉండాల్సిన జోష్ కనిపించకపోవడం గమనార్హం. కేవలం కొన్ని ప్యాకెట్లలో గెలుపు దక్కినా, నియోజకవర్గవ్యాప్తంగా హస్తం ప్రభావాన్ని చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ వైఫల్యానికి ప్రధాన కారణం పార్టీలోని అంతర్గత విభేదాలేనని స్పష్టమవుతోంది. ఒకే గ్రామంలో పార్టీ మద్దతుతో ఇద్దరు అభ్యర్థులు బరిలోకి దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. స్వయంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగి బుజ్జగించినా అభ్యర్థులు తలొగ్గకపోవడం, క్రమశిక్షణారాహిత్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఓ ప్రధాన నాయకుడి సోదరుడు మద్దతు తెలిపిన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేక పరాజయం పాలవ్వడం నాయకత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.

పట్నం ‘మౌనం’.. మమేకం వెనుక మర్మమేంటి?

గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అభ్యర్థులతో మమేకం కావడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఎన్నికల సమయంలో మౌనంగా ఉండి, ఫలితాల తర్వాత రంగంలోకి దిగడం వెనుక ఆయన వ్యూహం ఏంటి? పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికా లేక వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కండువా మార్చుకునేందుకు సిద్ధమవుతున్న నాయకులు..! 

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులను బట్టి కొందరు నాయకులు పార్టీ కండువా మార్చే ఆలోచన చేస్తున్నారు. మరో కొద్దీ రోజుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే తమ దారి ఎటువైపో అనేది స్పష్టం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు నియోజకవర్గం లోని పలువురు నాయకులు.ఇప్పటికే తెర వెనుకనుండి రాజకీయాలు నడిపిస్తున్న నాయకులు లోలోపల మంతానలను కుదిర్చుకుంటున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకులు తీసుకునే నిర్ణయం ఏంటో వేచి చూడాలి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా మెరుగుపడేనా..?

పంచాయతీ పోరులో చవిచూసిన చేదు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా పార్టీ పుంజుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాండూరు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవాలంటే నాయకులు గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. పట్టు కోల్పోతున్న కంచుకోటను కాపాడుకోవడానికి హస్తం నేతలు ఇప్పటికైనా మేల్కొంటారో లేదో.

ఇదిలా ఉంటే…..

తాండూరు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ నాయకుడు మాత్రం రాజకీయ చక్రం తిప్పుతున్నాడు. అయన ఫోకస్ మొత్తం మున్సిపల్ ఎన్నికలపైనే ఉందని సమాచారం. మున్సిపల్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తమ సొంత క్యాడర్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా ఒకే పార్టీ లో ఉన్న నాయకులు పార్టీ క్యాడర్ ను వేరు చేసుకుంటూ… కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు రాజకీయ పండితులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

You cannot copy content of this page

error: Content is protected !!