- శానిటేషన్ విభాగంలో లైంగిక వేధింపుల పర్వం…
- మహిళా కార్మికులపై వేధింపులు.. రాత్రి వేళల్లో మద్యం సేవించి అఘాయిత్యాలు
- హాజరు పట్టికలో అక్రమాలు.. డిజిటల్ రూపంలో లంచాల వసూళ్లు
- తాండూరు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లినట్టు సమాచారం… చర్యలకు డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కార్యాలయం అవినీతికి, అరాచకాలకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో ఓ అధికారి చేస్తున్న ఆగడాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. రక్షించాల్సిన అధికారియే భక్షకుడిగా మారి, అభాగ్య మహిళా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సదరు శానిటేషన్ అధికారి గత కొంతకాలంగా మహిళా లేబర్లను లైంగికంగా వేధిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో మద్యం సేవించి, విధుల్లో ఉన్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అధికారి హోదాను అడ్డుపెట్టుకుని, అమాయక కార్మికులను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వారిని మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. ఈ ‘గలీజ్’ పనులతో మున్సిపల్ శాఖ పరువు బజారున పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు.అవినీతిలోనూ ఈ అధికారి సరికొత్త పుంతలు తొక్కుతున్నాడు. పనులు కావాలంటే చేతులు తడపాల్సిందే.. అది కూడా నగదు రూపంలో కాదు, నేరుగా గూగుల్ పే , ఫోన్ పే లలో లంచాలు మేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యూటీకి రాని సిబ్బందికి కూడా హాజరు వేస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నాడు. హాజరు పట్టికలో ప్రెసెంట్ వేస్తూనే మహిళా కార్మికులను భయపెడుతూ… లోబర్చుకునే అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు ప్రజాప్రతినిధుల వద్ద ముడుపులు తీసుకుంటూ వారి వ్యక్తిగత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అధికారి అరాచకాలు మితిమీరడంతో బాధితులు, స్థానిక నాయకులు ఈ వ్యవహారాన్ని తాండూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మహిళా కార్మికులపై వేధింపులకు పాల్పడుతూ, డిజిటల్ లంచాలతో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఈ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.



