ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!

- ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం..!
- జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కఠిన చర్యలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కఠినంగా వ్యవహరించారు. ఎన్నికల విధుల్లో బాధ్యతారాహిత్యం ప్రదర్శించి, విధులకు గైర్హాజరైన ముగ్గురు పోలింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వయంగా బషీరాబాద్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ తనిఖీ సందర్భంగా, కుల్కచర్ల, పెద్దేముల్ మండలాలకు చెందిన పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన విధులకు హాజరు కాలేదని గుర్తించారు.
సస్పెండ్ ఐన అధికారులు….
మానస (ఎస్.జి.టి., పటేల్ చెరువు తండా, కుల్కచర్ల మండలం), నసీం రెహనా (స్కూల్ అసిస్టెంట్, నీటూరు ప్రాథమికోన్నత పాఠశాల, కుల్కచర్ల మండలం), అన్నపూర్ణ (స్కూల్ అసిస్టెంట్, ఎం.పి.పి.ఎస్., పెద్దేముల్ మండలం) గ్రామపంచాయతీ ఎన్నికల అత్యంత కీలకమైన ప్రక్రియలో వీరు పోలింగ్ అధికారుల (పీఓ/ఏపీఓ) హోదాలో నియమితులయ్యారు. అయితే, ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమై, బాధ్యతారహితంగా వ్యవహరించినందున, వారిని తక్షణమే సర్వీసు నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఉపేక్షను సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు.



