- తాండూరు మున్సిపాలిటీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం
- మహిళా వనం ద్వారా పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం!”
- హోటళ్లు, పబ్లిక్ టాయిలెట్లపై ఆకస్మిక తనిఖీలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రణాళిక తాండూరులో వేగంగా సాగుతోంది. సి.డి.ఎం.ఏ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపాలిటీలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా నిర్వహించబడింది. పట్టణ అభివృద్ధి మరియు ప్రజారోగ్యమే లక్ష్యంగా తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్, ప్రజాప్రతినిధులు కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు.కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు హోటళ్లను మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. ఆహార నాణ్యతను పరిశీలించి, నిబంధనలు పాటించని యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం బహిరంగ మరుగుదొడ్లను సందర్శించి, వాటి నిర్వహణ మరియు పరిశుభ్రతను స్వయంగా పర్యవేక్షించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా గొల్లచెరువు ట్యాంక్ బండ్ వద్ద “ఉమెన్స్ ఫర్ ట్రీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణాన్ని హరితవనంగా మార్చడంలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం ప్రజాప్రతినిధులు, సిబ్బందితో కలిసి మిని ట్యాంక్ బండ్ పరిసరాల్లో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళికను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.






