పైలట్ నివాసం లో పడి పూజ…!

- అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన పైలట్ నిలయం!
- మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో అత్యంత వైభవంగా అయ్యప్ప పడి పూజ
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో అత్యంత వైభవంగా నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తింది. శబరిమల యాత్రకు దీక్ష వహించిన స్వాములు, భక్తుల కోలాహలం మధ్య ఈ పూజ కన్నుల పండుగగా జరిగింది.రోహిత్ రెడ్డి నివాసం అయ్యప్పస్వామి ఆలయాన్ని తలపించింది. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై పదునెనిమిది పవిత్ర మెట్లు (పడి) ఏర్పాటు చేసి మహా పడి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు.పూజా కార్యక్రమం మొత్తంలో ‘స్వామియే శరణం అయ్యప్ప!’ అనే శరణు ఘోష నిరంతరం వినిపించింది. వందలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తులు, మహిళలు పాల్గొని భజనలు, అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతాన్ని పవిత్ర భక్తి తరంగాలతో నింపేశారు.

ఈ కార్యక్రమం ద్వారా తాండూరు ప్రాంతానికి, ప్రజలకు అయ్యప్పస్వామి అనుగ్రహం, సకల శుభాలు కలగాలని భక్తులు, స్వాములు మనసారా కోరుకున్నారు.ఈ మహా పడిపూజ కార్యక్రమం ఆధ్యాత్మికతకు, భక్తికి నిదర్శనంగా నిలిచింది.



