- తాండూరు ఆసుపత్రిలో ‘సూపరింటెండెంట్’ సెగ…!
- ఉద్యోగుల విలవిల!
- నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీ రోస్టర్ మార్పులు?
- -నా మరో రూపం చూస్తారు” అంటూ బెదిరింపులు..
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సిబ్బంది సిద్ధం.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాలన గాడి తప్పిందా? సూపరింటెండెంట్ తీరుతో సిబ్బంది మనస్తాపానికి గురవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిందని, సిబ్బందిని మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నర్సింగ్ సిబ్బంది డ్యూటీ రోస్టర్, వార్డుల కేటాయింపు అనేది నర్సింగ్ సూపరింటెండెంట్ పరిధిలోని అంశం. అయితే, ప్రస్తుత మెడికల్ సూపరింటెండెంట్ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ, తనకు నచ్చినట్లుగా రోస్టర్‌ను మారుస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జిల్లా ఆసుపత్రి నుండి మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (MCH), అక్కడి నుండి ఇక్కడికి తరచుగా బదిలీలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
“మూడో కన్ను తెరుస్తా.. జాగ్రత్త!”
సిబ్బందితో సూపరింటెండెంట్ ప్రవర్తించే తీరు అత్యంత దారుణంగా ఉందని సమాచారం. నన్ను ఒక సైడే చూశారు.. నా నిజస్వరూపం మీకు తెలియదు”, నేను చెప్పింది వినకపోతే మూడో కన్ను తెరుస్తా”, “మీ సర్వీస్ బుక్కులు నా దగ్గరే ఉన్నాయి.. ఏం చేస్తానో చూడండి” అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బందికి కొమ్ముకాస్తూ, మరికొందరిని టార్గెట్ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని, దీనివల్ల తాము విధుల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని నర్సింగ్ సిబ్బంది చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే గడప తొక్కనున్న బాధితులు…!
ఈ సమస్యపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లగా, ఎన్నికల హడావిడి ముగిశాక మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సిబ్బంది అంతా కలిసి ఎమ్మెల్యేను కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారు.
“అక్రమ బదిలీలు ఆపాలి..!
వేధింపులకు గురిచేస్తున్న సూపరింటెండెంట్‌ను వెంటనే మార్చాలి.. లేదంటే విధులకు దూరంగా ఉంటాం” అని సిబ్బంది భీష్మించుకున్నట్లు సమాచారం.






