
- ఓటర్ల జాబితాలో ‘ఒకటో వార్డు’ మాయం!
- అయోమయంలో అభ్యర్థులు, ఓటర్లు..
- అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలో పెను కలకలం రేగుతోంది. సాంకేతిక లోపమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ, అధికారిక వెబ్సైట్లో ఒకటో వార్డుకు సంబంధించిన వివరాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం నుంచి ఈసీ అందుబాటులోకి తెచ్చిన లింక్లో మిగిలిన వార్డుల డేటా కనిపిస్తున్నా, ‘వార్డు నంబర్ 1’ మాత్రం ఎక్కడా లభ్యం కావడం లేదు. దీంతో స్థానిక ఓటర్లు, పోటీ చేసేందుకు సిద్ధమైన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అధికారులు ఓటర్ల జాబితాను ఆన్లైన్లో పొందుపరిచారు. తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేందుకు స్థానికులు వెబ్సైట్ను తనిఖీ చేయగా,తాండూరు మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డుకు సంబంధించిన డేటా లింక్ కాకపోవడంతో అంతా విస్తుపోయారు. ఇతర వార్డుల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నా, కేవలం ఒకటో వార్డు విషయంలోనే ఈ గందరగోళం ఎందుకు నెలకొందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలవాలనుకునే వార్డు సభ్యులు తమ వార్డు పరిధిలోని ఓటర్ల సంఖ్య, వివరాలు తెలియక పరేషాన్ అవుతున్నారు. ప్రచార ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన సమయంలో జాబితా అందుబాటులో లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని, కనీస పర్యవేక్షణ లేకుండా జాబితాను ఎలా విడుదల చేస్తారని స్థానికులు మండిపడుతున్నారు.వెంటనే ఎన్నికల అధికారులు స్పందించి ఆన్లైన్ లింక్లో లోపాలను సరిదిద్దాలని, 1వ వార్డు ఓటర్ల జాబితాను తక్షణమే అందుబాటులో ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



