- అభివృద్ధిని విస్మరించిన మాజీ ఎమ్మెల్యే..
- లోకల్’ విమర్శలు హాస్యాస్పదం
- తాండూరు అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకుల ఘాటు విమర్శలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రజల సమస్యలను వదిలేసి కేవలం తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం బిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం లో మాట్లాడిన మాటలను గురువారం కాంగ్రెస్ నాయకులు ఖండించారు.ఈ సందర్బంగా వారు..మాట్లాడుతూ, గత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. గత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన పదవీ కాలంలో వార్డుల్లో రోడ్లు, డ్రైన్లు, బోర్లు వేయించడం పూర్తిగా విస్మరించారని, కేవలం తన ఇంటి చుట్టూ రోడ్లు వేయించుకోవడానికే పరిమితమయ్యారని నాయకులు ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న కనీస అవసరాలను పట్టించుకోని వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ‘నాన్ లోకల్’ అని బిఆర్ఎస్ చేస్తున్న విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. మనోహర్ రెడ్డి 2004 నుంచే తాండూరులోని శాంతినగర్లో సొంత ఇల్లు ఉందన్నారు. ఆయన ఇక్కడి వాడేనని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పనితీరుపై నమ్మకంతోనే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచారని వారు గుర్తు చేశారు. 36 వార్డుల్లో 19 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించడం ద్వారా ప్రజలు బిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడారని పేర్కొన్నారు.బిఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చికెన్ షాప్ ముందు బలిసిన కోడి తొడ కొట్టినట్లు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. అనవసరంగా తొడలు కొట్టడం వల్ల ఓట్లు పడవని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాటల కంటే పనులకే ప్రాధాన్యత ఇస్తారని, ఇప్పటికే ప్రతి వార్డుకు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించారని వెల్లడించారు. అలాగే, త్వరలోనే అర్హులైన పేదలకు 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షం ఓడిపోయిన బాధలో విమర్శలు చేయడం మానేసి, అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు.



