- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో బాధ్యతల స్వీకరణ
- వేద మంత్రోచ్చరణలతో మార్మోగిన మున్సిపల్ కార్యాలయం
- పార్టీలాతీతంగా శుభాకాంక్షల వెల్లువ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో కొత్త శకం మొదలైంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి సోమవారం అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన్ చాంబర్ వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నీరజా బాల్‌రెడ్డిని చైర్పర్సన్ పీఠంపై కూర్చుండబెట్టి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాండూరు అభివృద్ధి బాధ్యత ఇకపై నీరజా బాల్‌రెడ్డి భుజస్కంధాలపై ఉందని, పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుక సాగడం విశేషం. చైర్పర్సన్ నీరజా బాల్‌రెడ్డితో పాటు వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ కు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొనగా, మున్సిపల్ కార్యాలయం నేతలు, కార్యకర్తల రాకతో జనసముద్రాన్ని తలపించింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకముంచి ఈ బాధ్యతను అప్పగించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, తాండూరు సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉద్ఘాటించారు. అభినందనల వెల్లువతో మున్సిపల్ కార్యాలయం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.



