గర్భిణి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

- కోర్టు తీర్పు వెల్లడి
- కఠిన శిక్ష విధించిన గౌరవ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శ్రీ డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి
- అభినందించింది జిల్లా ఎస్పీ
తాండూరు జనవాహిని ప్రతినిధి : పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016వ సంవత్సరంలో జరిగిన నిండు గర్భిణి హత్య కేసులో వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి శ్రీ డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి సంచలన తీర్పును వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 5,000/- జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ తెలిపారు. జరిమానా చెల్లించడంలో నిందితుడు విఫలమైతే, అదనంగా ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.పెద్దెముల్ మండలం, బండపల్లి గ్రామానికి చెందిన గుండె పల్లి రవికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ కారణంగా అతను తన భార్యను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.
2016 జనవరి 03వ తేదీన, రవి భార్య 8 నెలల గర్భిణిగా ఉంది. మళ్లీ ఆడపిల్లే పుడుతుందనే అనుమానంతో, రవి తన భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే అప్పటి పెద్దేముల్ ఎస్ఐ కె. కృష్ణ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి తాండూర్ రూరల్ సీఐ సిహెచ్. సైది రెడ్డి కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకుని, నేరస్తుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులైన కె. కృష్ణ సిహెచ్. సైది రెడ్డి ప్రస్తుత తాండూర్ ఎస్డీపీఓ ఎన్. యాదయ్య, ప్రస్తుత తాండూర్ రూరల్ సీఐ ఎం. ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత ఎస్ఐ శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. సుధాకర్ రెడ్డి, మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ స్నేహ మెహ్రా ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.



