- రజక సంఘం నాయకులపై దాడి!
- కులం పేరుతో దూషణలు.. ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ ప్రజాప్రతినిధి తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక రజక సంఘం నాయకులపై 22వ వార్డు కౌన్సిలర్ రాము భౌతిక దాడికి దిగడం పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితులు తాండూరు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వెనుక భాగంలో రజకులకు సంబంధించిన దోబీఘాట్ ఉంది. దీనికి ఆనుకుని ఉన్న స్మశాన వాటికలో భవన నిర్మాణ పనులను అధికార పార్టీ కౌన్సిలర్ రాము పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ నిర్మాణ పనుల కోసం రెండు రోజుల క్రితం దోబీఘాట్ ప్రహరీ గోడను కౌన్సిలర్ కూల్చివేయించారని రజక సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.గురువారం ఉదయం నిర్మాణ పనుల వద్ద ఉన్న కౌన్సిలర్ రామును, గోడ కూల్చివేతపై ప్రశ్నించేందుకు రజక సంఘం నాయకులు వెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన కౌన్సిలర్ రాము.. రజక జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కృష్ణ, తాండూరు రజక సంఘం అధ్యక్షుడు రాజులపై చేయి చేసుకున్నారని బాధితులు ఆరోపించారు. తమను కులం పేరుతో దూషిస్తూ, తీవ్రమైన పదజాలంతో ప్రాణహాని తలపెడతామని బెదిరించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.తమపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలను బాధితులు లేఖ రూపంలో పోలీసులకు అందజేశారు. బాధ్యులైన కౌన్సిలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఒక ప్రజాప్రతినిధి సామాన్యులపై దాడికి దిగడం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.





