
- తాండూరు భద్రేశ్వరాలయ ఆదాయానికి గండి..
- నిబంధనలు తుంగలో తొక్కి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం!
- తాండూరు భద్రేశ్వరాలయ ఆస్తుల దుర్వినియోగం
- అధికారులు సైలెంట్.. అక్రమాలు వాయువేగం!
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణ నడిబొడ్డున వెలసిన పురాతన భద్రేశ్వర స్వామి దేవాలయ ఆదాయానికి భారీ గండి పడుతోంది. ఆలయ అభివృద్ధి పేరుతో కొందరు వ్యక్తులు, అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు తెరలేపారు. బహిరంగ వేలం లేదు, మున్సిపల్ అనుమతులు లేవు.. కేవలం ‘వసూళ్ల’ పర్వమే పరమావధిగా ఈ అక్రమ నిర్మాణాలు సాగుతుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
నోటిఫికేషన్ లేదు.. వేలం అసలే లేదు!
సాధారణంగా దేవాలయానికి సంబంధించిన స్థలాల్లో దుకాణాలు నిర్మించాలన్నా లేదా అద్దెకు ఇవ్వాలన్నా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహించాలి. కానీ, ఇక్కడ అవేమీ పట్టవు. ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండానే రహస్యంగా దుకాణాల ఎంపిక జరిగిపోయింది. ఒక్కో దుకాణదారుడి వద్ద 7లక్షలు, 5లక్షలు ఆపై వసూళ్లు చేసి ఎవరి వాటా వారు పంచుకున్నారా లేదా ఆలయం ఖాతాలో జమ అయ్యాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘డిపాజిట్ స్కీం’ పేరుతో పాత దుకాణదారుల దగ్గర, కొత్త వారి దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ నిధులు ఏ ఖాతాలోకి వెళ్తున్నాయి?
దుకాణాల నిర్మాణం కోసం వసూలు చేస్తున్న లక్షలాది రూపాయల నగదు ఏ బ్యాంకు ఖాతాలోకి వెళ్తోందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేవాలయ నిధులు అధికారిక ఖాతాలో జమ కావాలి. కానీ, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే లావాదేవీలు జరుగుతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో ఆలయానికి రావాల్సిన అద్దె ఆదాయం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అనుమతులు శూన్యం
పట్టణంలోని ప్రధాన కూడలిలో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా, కనీసం మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ప్లాన్ అప్రూవల్ ఉండాలి, కానీ ఇక్కడ అక్రమంగా పిల్లర్లు లేస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా, ఒక ప్రముఖ నాయకుడి అండదండలు ఉండటంతో వారు మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ నిర్మాణాలు చేపడుతున్న, అక్రమంగా నిర్మాణాలు వెలువెత్తుతున్న మున్సిపల్ అధికారుల కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడం తో మామూళ్ళ మత్తులో మున్సిపల్ అధికారులు మునిగిపోయారు అనే ఆరోపణలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈఓ ప్రమేయం ఏడ…?
ఈ దుకాణ సముదాయలు జరుగుతున్నా క్రమంలో దుకాణాల వేలం పాట జరుగుతున్నా సమయం లో ఈఓ ప్రమేయం లేనట్టే కనిపిస్తుంది. ఈఓ ప్రవేయం లేకపోవడం తో అవినీతికి తవిస్తుంది. ఇకపక్షంగా ఓ వ్యక్తి వ్యవహారిస్తుండడం విడ్డురం.



