- – అప్పుల పాలై తల్లిదండ్రులకు భారం కావొద్దు
- – మాజీ ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగుల ఎబినేజర్
జనవాహిణి ప్రతినిధి తాండూరు : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో యువత బెట్టింగ్‌ల బారిన పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వికారాబాద్ జిల్లా మాజీ ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి జోగుల ఎబినేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రికెట్ అనేది ఒక వినోదమని, దానిని జూదంగా మార్చుకుని జీవితాలను పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బెట్టింగ్‌లు, జూదం వంటి సామాజిక రుగ్మతలపై ఉక్కుపాదం మోపుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.చాలామంది యువకులు సరదాగా బెట్టింగ్‌లు ప్రారంభించి, చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయి తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలే తప్ప, ఇలాంటి వ్యసనాలకు బానిసలై భారం కాకూడదని కోరారు. బెట్టింగ్ నిర్వాహకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు.



