ఎమ్మెల్యే ఎంట్రీతో హైటెన్షన్..!

- ప్రచార సమయం ముగిసినా ‘రెడ్డి’ ఎంట్రీతో హైటెన్షన్
- ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు
- ఎమ్మెల్యే అక్రమ ఊరేగింపుపై తీవ్ర ఉద్రిక్తత
- ప్రచార సమయం ముగిసినా దౌర్జన్యం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత కూడా గౌతాపూర్ గ్రామం బుధవారం ఉదయం అనూహ్య రాజకీయ డ్రామాకు వేదికైంది. గ్రామ సర్పంచ్ ఎన్నికల పోరులో కాంగ్రెస్ మద్దతుతో జన్నె సృజన మరియు బీఆర్‌ఎస్ మద్దతుతో సుజాత రాజప్ప గౌడ్ తలపడుతున్న నేపథ్యంలో, ప్రచారం ముగిసిన తర్వాత తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హఠాత్తుగా గ్రామంలో అడుగుపెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.మంగళవారం సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ, బుధవారం ఉదయం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన పార్టీ నేతలు, అనుచరులతో కలిసి గౌతాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఊరేగింపు’గా రావడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.గ్రామ పెద్దలు రాంరెడ్డి, బీజేపీ నాయకులు సాయిరెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు, ప్రచార సమయం ముగిసినా సమావేశాలు ఎందుకు?” అంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్ నాయకుల నిరసనతో కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గ్రామం నుంచి వెళ్లిపోయినప్పటికీ, ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి సుజాత రాజప్ప గౌడ్ తక్షణం తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఎంపీడీఓ విశ్వప్రసాద్లకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గ్రామంలో ర్యాలీ నిర్వహించడమే కాక, సుమారు 500 మందితో సమావేశం నిర్వహించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో దౌర్జన్యం ప్రదర్శించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి,” అని సుజాత రాజప్ప గౌడ్ తమ ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వివరణ, కేవలం పరామర్శకే…
మరోవైపు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాత్రం తాను ప్రచారం కోసం వెళ్లలేదని, కేవలం గ్రామంలో ఉన్న కొందరిని పరామర్శించేందుకు మాత్రమే వెళ్లానని వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రచార సమయం ముగిసిన ఎమ్మెల్యే గ్రామంలోకి రావడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది.ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందిన నేపథ్యంలో, దీనిపై జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.



