ఇక్కడ బిర్యానీ’.. తింటే ‘హరీ’..!

- దుర్గమ్మ గుడి పక్కనే ‘దెయ్యం’ పట్టిన రెస్టారెంట్
- ప్లేటులో బొద్దింకలు.. ముక్కల్లో కుళ్లు..
- అధికారులు ఫుల్ ఖుషీ!
- సోషల్ మీడియా లో ఫేమస్ అవుతున్న హోటల్
జనవాహిని ప్రతినిధి తాండూరు : బిర్యానీకి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ అనుకుంటే పొరపాటే.. కుళ్లిన మాంసం బిర్యానీకి ‘తాండూరు’ ఇప్పుడు కొత్త అడ్రస్‌గా మారుతోంది! తాండూరులోని ప్రసిద్ధ దుర్గ రెస్టారెంట్ కస్టమర్ల పాలిట యమపురిగా మారుతోంది. “టేస్ట్ అదిరిపోద్ది.. హెల్త్ గోవిందా..” అనే రేంజ్లో ఇక్కడ వంటకాలు తయారవుతున్నాయి. తాజాగా ఈ రెస్టారెంట్లో వెలుగు చూసిన ‘కుళ్లిన చికెన్’ ఉదంతం చూస్తుంటే, బిర్యానీ తినాలంటేనే తాండూరు ప్రజలు గజగజ వణుకుతున్నారు.
మెనూలో లేని ‘బొద్దింకలు’.. ఫ్రీగా వడ్డింపు!
ఈ రెస్టారెంట్ చరిత్ర చాలా ఘనమైంది. గతంలో ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో ఏకంగా బొద్దింక ప్రత్యక్షమై ‘హాయ్’ చెప్పింది. అప్పట్లో రచ్చ జరిగినా, ‘మా స్టైలే ఇంత’ అన్నట్లుగా యాజమాన్యం తీరు మార్చుకోలేదు. ఇప్పుడు ఏకంగా మాంసం కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నా.. మసాలాలు దట్టించి కస్టమర్ల పొట్ట కొట్టాలని చూశారు. తినేటప్పుడు ముక్క వాసన రావడంతో కస్టమర్లు నిలదీయగా, అక్కడ పెద్ద యుద్ధమే జరిగింది.తాండూరులో హోటళ్లు, రెస్టారెంట్లు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నాయి. కానీ, వాటిని తనిఖీ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ‘అడ్రస్ లేరు’. పట్టణంలో ఉన్న మున్సిపల్ అధికారులు కూడా “మాకు సంబంధం లేదు” అన్నట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరం.అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే.. హోటల్ యజమానులకు వారు ‘అభయహస్తం’ ఇస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాన్యుడి ప్రాణం అంటే అధికారులకు అంత చులకనా…!
దుర్గ రెస్టారెంట్ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. “మున్సిపల్ అధికారులు స్పందించరా? లేక మాకు ఫుడ్ పాయిజన్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా?” అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రలేచి తనిఖీలు చేయకపోతే, తాండూరులో ‘ఫుడ్ పై ఫైట్’ తప్పేలా లేదు.ఆకలి వేస్తుందని ఆత్రంగా బిర్యానీ ఆర్డర్ చేసే ముందు.. అది చికెన్ ముక్కా లేక కుళ్లిన ముక్కా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.. లేదంటే హాస్పిటల్ బెడ్ గ్యారెంటీ! అంటున్నారు స్థానిక ఫుడ్ లవర్స్.




