16.7 C
New York
Sunday, May 19, 2024

Buy now

IPL Impact Player: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో ఆల్ రౌండర్ల పని ఖతం.. అలాంటిదేమీ లేదు: అక్షర్ vs డివిలియర్స్

IPL Impact Player: ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్ రౌండర్లను లేకుండా చేస్తోందంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదలు పెట్టిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్ రౌండర్ పాత్ర ప్రమాదంలో పడిందని రోహిత్ కామెంట్స్ ను సమర్థించేలా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మాట్లాడాడు. మరోవైపు దీనివల్ల పెద్దగా నష్టమేమీ లేదంటూ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అనడం విశేషం.

ఇంపాక్ట్ ప్లేయర్‌తో డేంజరే: అక్షర్

ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తాజాగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై స్పందించాడు. “ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఆల్ రౌండర్ పాత్ర ప్రమాదంలో పడిందని ఓ ఆల్ రౌండర్ గా నేను భావిస్తున్నాను. దీనివల్ల ప్రతి టీమ్ ఓ ప్యూర్ బ్యాటర్ లేదంటే ప్యూర్ బౌలర్ ను ఆడించడానికే చూస్తోంది. దీంతో ఆల్ రౌండర్లను ఉపయోగించుకోవడం లేదు” అని అక్షర్ అన్నాడు.

“ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ప్రతి టీమ్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ ప్రకారం.. తమ దగ్గర ఆరుగురు బ్యాటర్లు లేదా బౌలర్లు ఉన్నట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇది కొన్నిసార్లు చాలా అయోమయానికి గురి చేస్తోంది” అని అక్షర్ అభిప్రాయపడ్డాడు. గతేడాది నుంచే ఐపీఎల్లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను అనుమతించారు. దీనివల్ల టీమ్స్ మొదట ఓ బ్యాటర్ లేదా బౌలర్ ను ఆడించి తర్వాత ఆ ప్లేయర్ ను మరో బ్యాటర్ లేదా బౌలర్ తో భర్తీ చేస్తున్నాయి.

ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల నష్టమేమీ లేదు: ఏబీ

మరోవైపు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మాత్రం ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల పెద్దగా నష్టం జరుగుతుందని తాను అనుకోవడం లేదని అనడం విశేషం. తన యూట్యూబ్ ఛానెల్లో అతడు మాట్లాడాడు. “ప్రస్తుతానికి ఇది బ్యాటర్ ఆధిపత్యం ఉన్న ఆట. వాళ్లు మాంచి ఊపు మీదున్నారు. వికెట్లు కూడా వాళ్లకు అనుకూలంగా ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకొచ్చినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఎదురు చూశాను. అప్పుడే దీనిపై ఏమీ చెప్పలేం. కానీ నా వరకైతే దీనివల్ల పెద్దగా నష్టమేమీ లేదు” అని ఏబీ డివిలియర్స్ అన్నాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై మొదటగా గళమెత్తింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే కావడం గమనార్హం. దీనిపై పబ్లిగ్గానే అతడు విమర్శలు గుప్పించాడు. కేవలం వినోదం కోసం ఆటకు చేటు చేస్తున్నారని అతడు అన్నాడు. అటు స్టార్ పేస్ బౌలర్ బుమ్రా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పటి నుంచీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై చర్చ మొదలైంది.

పలువురు మాజీ ప్లేయర్స్ కూడా దీని వల్ల నష్టం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఈ ఐపీఎల్లో హార్దిక్, శివమ్ దూబెలాంటి ఆల్ రౌండర్లను బౌలింగ్ లోనూ పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాశం లేకుండా పోతోంది. మరి దీనిపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles