పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తమ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు రావాలని, దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇస్తామని ఏపీ సీఎం ప్రకటించారు. అనుమతులన్నీ సీఎంఓ నే పర్యవేక్షిస్తుందని, ఎలాంటి రెడ్ టేపిజం , బ్రోకరిజం అంటూ ఉండదని జగన్ స్పష్టం చేశారు. టూర్ సందర్బంగా అక్కడి ఇన్వెస్టర్స్ తో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారినా పాలసీలలో ఎలాంటి మార్పులు లేవని, అయితే మరింత పారదర్శకంగా ఉండేలా ఇండస్ట్రియల్ పాలసీని తీర్చి దిద్దామని జగన్ వెల్లడించారు.

ఏపీలో పరిశ్రమలు నెలకొల్పాలని అనుకునే వారికి తమ ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ఎలాంటి అడ్డంకులు అంటూ ఉండవని స్పష్టం చేశారు. అంతకు ముందు వాషింగ్టన్ డీసీ లోని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి హాజరయ్యారు జగన్. అక్కడ ఇండియన్ అంబాసిడర్ హర్షవర్ధన్ తో సమావేశమయ్యారు. పలు కీలక చర్చలు జరిపారు. అనంతరం యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నారు. గతంలో ఉన్నన్ని నియమ, నిబంధనలు అంటూ ఉండవన్నారు. ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే ఒక్క దరఖాస్తు చేసుకుంటే చాలని చెప్పారు. వారికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

ఇందు కోసం సీఎం కార్యాలయం దగ్గరుండి పర్యవేక్షిస్తుందని జగన్ చెప్పారు. తాము ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ – ఇప్మా .. ఇండస్ట్రియలిస్ట్ లకు , పెట్టుబడిదారులకు అండగా ఉంటుందన్నారు. వారికి చేయూతనివ్వడం , పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్ , నీరు సమకూరుస్తుందని తెలిపారు. పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం. సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు కొత్తగా పోర్టులు కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. వీటిలో మిమ్మల్ని భాగస్వామ్యం పంచు కోవాలని కోరుతున్నా అని జగన్ తెలిపారు. విద్యుత్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఏపీలో విద్య, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here