ఆకాశంలో విహ‌రించే వారంతా రోడ్డు పాల‌య్యారు. అనాలోచిత‌మైన నిర్ణ‌యాలు..ఆదాయాన్ని ప‌క్క‌దారులు ప‌ట్టించ‌డం..లెక్క‌కు మించి అప్పులు చేయ‌డం..వాటిని ఎగ్గొట్టాల‌ని చూడ‌టం ఇదేగా ..గ‌త కొన్నేళ్లుగా ఇండియాలో జ‌రుగుతున్న తతంగం. ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా వంద కోట్ల‌కు పైగా జ‌నాభా ఉన్నా ఏ ఒక్క‌రు బాధ్య‌త‌తో ప్ర‌శ్నించే హ‌క్కును కోల్పోయారు. నోట్ల‌కు ఓట్లు అమ్ముకున్నాక వీరికేం విలువ ఉంటుంది. అందుకే ఒకప్పుడు జాతి భ‌విష్య‌త్ కోసం పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌లు జ‌రిగేవి. చ‌ట్టాలు రూపొందేవి. కానీ ఇపుడు వ్యాపార‌స్తులు, కార్పొరేట్ కంపెనీలు స్పాన్స‌ర్ చేసిన వారే చ‌క్రం తిప్పుతున్నారు. ఆర్థిక నేర‌గాళ్ల‌కు అండ‌దండ‌లు అందిస్తున్నారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతున్నా..జ‌ర‌గాల్సిన అన్యాయం జ‌రుగుతూనే ఉన్న‌ది.
 
ఓ వైపు మాల్యా దేశం విడిచి పోయి ..ఎంజాయ్ చేస్తున్నా ఇంకా ఇండియాకు రావడం లేదు. నా ఆస్తుల‌కు లెక్క‌లేన‌న్ని వున్నాయి..నాకు ప‌ర్మిష‌న్ ఇవ్వండి ..నేను అమ్మి క‌డ‌తానంటున్నాడు. ఇంకో వైపు కింగ్స్ ఎయిర్ లైన్స్‌ను ఆయ‌న కూడా ఇలాగే ఆడుకున్నాడు. సిబ్బందితో చెల‌గాట‌మాడాడు. వారిని రోడ్డు పాలు చేశాడు. ఇపుడు జెట్ ఎయిర్ వేస్ వంతు వ‌చ్చింది. యాజ‌మాన్యం టేకాఫ్ ప్ర‌క‌టించింది. విశిష్ట సేవ‌లందిస్తూ అన‌తి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న జెట్ ఎయిర్ వేస్ ఎందుకు న‌ష్టాల‌కు గురైంద‌న్న‌ది ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డం లేదు. వంద‌లాది మంది సిబ్బంది, ఉద్యోగులంతా ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఒక్క‌సారి ఆకాశంలోకి ఎగిరాక‌..కింద ప‌నిచేయమంటే ఏం చేస్తారు. ప‌నిలో అనుభ‌వం గ‌డించిన వీరికి ఎక్కువ డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ..పెరిగిన ఆయిల్ ధ‌ర‌లు, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, కొనుగోలు చేసిన విమానాల స్టేట‌స్..ఇవ‌న్నీ ఒక వైపు క‌ల‌వ‌ర పెడుతుంటే మ‌రో వైపు అప్పులు ఇచ్చిన ఎస్బిఐ రుణాల వ‌సూలుకు అన్ని ఆస్తుల‌ను అటాచ్ మెంట్ చేసుకునేందుకు నోటీసులు కూడా ఇచ్చింది.
 
ఇంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా ..కేంద్రంలోని ప్ర‌భుత్వం క‌నీసం దీనిని ప‌రిష్క‌రించే దిశ‌గా ఆలోచించ‌లేదు. త‌మ అవ‌స‌రాల నిమిత్తం, వ్యాపారాలు చేసేందుకు వేలాది మంది ఇండియాలోనే కాకుండా ఇత‌ర దేశాల‌కు వెళుతుంటారు. ప్ర‌తి ఒక్క‌రికి విమాన ప్ర‌యాణం అన్న‌ది భాగ‌మై పోయింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌రంగా ఎన్నో సంస్థ‌లు ఉన్నా..త‌క్కువ టైంలో ఎక్కువ స‌ర్వీసుల‌ను అందించిన సిబ్బందిలో జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులే ఉన్నారు. అంత‌గా వారు త‌మ సంస్థ‌లో లీన‌మ‌య్యారు. ఆ సంస్థ‌ను కాపాడుకునేందుకు చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేశారు. అయినా మార్పు రాలేదు. పూర్తిగా మూసి వేసేందుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా యాజ‌మాన్యం ఆలోచిస్తోంది. దీనిని సిబ్బంది ఒప్పు కోవ‌డం లేదు. మ‌రో వైపు అనుభ‌వం క‌లిగిన జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగుల‌కు ఇత‌ర ఎయిర్ వేస్ కంపెనీలు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇది ఒక‌ర‌కంగా మంచి ప‌రిణామం. కానీ ఇలా ఎంత కాలం అంద‌రికీ అన్ని కంపెనీలు అకామిడేట్ చేయ‌లేవు.
 
పెరిగిన ఆయిల్ ధ‌ర‌లు విమానాల పాలిట శ‌రాఘాతంగా త‌యార‌య్యాయి. కోలుకోలేని రీతిలో సంస్థుల కొట్టుమిట్టాడుతున్నాయి. జ‌నం ఆఫ‌ర్ల‌ను కోరుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం కూడా ఒకందుకు విమానాల రాక‌పోక‌ల‌పై ప‌డుతోంది. దీనిని ఎట్లా అధిగ‌మించాలో తెలియ‌క విమానాయ‌న సంస్థ‌లు, యాజ‌మాన్య‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. కోట్లాది రూపాయ‌ల వ్యాపారం రోజుకు జ‌రుగుతున్నా..మిగ‌తా సంస్థ‌లు ఇప్ప‌టికైనా గ‌మ‌నించి..ప‌ద్ధ‌తి ప్ర‌కారం నిర్వ‌హిస్తే..కొంత మేర‌కు ప్ర‌యోజ‌నం వుంటుంది. లేక‌పోతే జెట్ ఎయిర్ వేస్ కు ప‌ట్టిన గ‌తే ప‌ట్ట‌డం ఖాయం. టాటా కంపెనీ టేకోవ‌ర్ దిశ‌గా పావులు క‌దిపినా…ఎందుక‌నో వెన‌క్కి త‌గ్గింది.
 
సిబ్బందిని స్పైస్ జెట్ యాజ‌మాన్యం తీసుకుంది. మిగిలి పోయిన విమానాల‌ను లీజుకు తీసుకునే ప‌నిలో ఉన్న‌ది ఎయిర్ ఇండియా యాజ‌మాన్యం. గాల్లోకి ఎగిరినంత ఈజీ కాదు..సంస్థ‌ను న‌డ‌ప‌డం అంటే.. ఇపుడు అనుభ‌వ పూర్వ‌కంగా తెలిసొచ్చింది జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగుల‌కు..యాజ‌మాన్యానికి. ఒక్క‌సారిగా అనూహ్య‌మైన లాభాలు పొందిన ఈ సంస్థ ఉన్న‌ట్టుండి ఎందుక‌లా న‌ష్టాలు కొని తెచ్చుకుందో తెలియ‌డం లేదు. వ‌చ్చిన డ‌బ్బుల‌ను యాజ‌మాన్యం తెలివిగా వేరే వైపు మ‌ళ్లించిందా లేక కావాల‌నే న‌ష్టాల బూచి చూపి రుణాలు ఎగ‌వేద్దామ‌ని అనుకుంటున్నారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. స‌ర్కారే ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగితే కానీ ..ఈ దొర‌బాబులు చేసిన మ‌త‌ల‌బు ఏమిటో తెలుస్తుంది. ఏం చేస్తాం..ఉద్యోగులు పాపం అన‌క త‌ప్ప‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here