Site icon janavahinitv

Ind vs Pak in T20 WC Promo: అల్టిమేట్ ఫైట్.. టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా, పాకిస్థాన్ ప్రోమో రిలీజ్

Ind vs Pak in T20 WC Promo: క్రికెట్‌లో ఈ ఏడాది మరో వరల్డ్ కప్ అభిమానులను అలరించనుంది. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కదా. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ గురువారం (ఏప్రిల్ 25) రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ నే ఆ ఛానెల్ హైలైట్ చేసింది.

టీ20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరు

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ లో జరగనుంది. ఈ మ్యాచ్ అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రోమోను గురువారం (ఏప్రిల్ 25) స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది.

ఇందులో 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం, తర్వాత 2009 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ విజయం.. 2022 వరల్డ్ కప్ లో హరీస్ రౌఫ్ బౌలింగ్ విరాట్ కోహ్లి కొట్టిన షాట్ ఆఫ్ ద సెంచరీ క్లిప్స్ ను స్టార్ స్పోర్ట్స్ జోడించింది. ఇప్పటి వరకూ ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ మరుపురాని క్షణాలను ఈ వీడియోలో చూపించారు.

2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి ఇండియా విజేతగా నిలిచింది. ఇప్పటి వరకూ ఇండియా గెలిచిన ఏకైక టీ20 వరల్డ్ కప్ అదే. ఆ ఫైనల్లో జోగిందర్ శర్మ బౌలింగ్ లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్, ఇండియన్ టీమ్ సెలబ్రేషన్స్ ఈ వీడియోలో చూడొచ్చు.

ఇక 2009లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ను పాకిస్థాన్ గెలిచింది. అప్పుడు ఫైనల్లో శ్రీలంకను ఓడించి ఆ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో అఫ్రిది కొట్టిన విన్నింగ్ రన్స్ ను కూడా స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోలో చేర్చింది. 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై అసాధ్యమనుకున్న విజయాన్ని తన రెండు కళ్లు చెదిరే సిక్స్ లతో సుసాధ్యం చేశాడు విరాట్ కోహ్లి. ఈ వీడియోలో ఆ షాట్లకూ చోటు దక్కింది.

టీ20 వరల్డ్ కప్ 2024

టీ20 వరల్డ్ కప్ 2024 ఈ ఏడాది జూన్ 2 నుంచి జూన్ 29 వరకు కరీబియన్ దీవులతోపాటు అమెరికాలో జరగనుంది. ఇండియా ఆడే లీగ్ మ్యాచ్ లలో చాలా వరకూ అమెరికాలోనే ఉన్నాయి. జూన్ 5న తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడనుంది. తర్వాత జూన్ 9న పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ దాయాదుల క్రికెట్ యుద్ధాన్ని చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గతేడాది వన్డే వరల్డ్ కప్ లోనూ ఈ రెండు టీమ్స్ తలపడగా.. అందులోనూ ఇండియా గెలిచింది. ఇప్పటి వరకూ ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఎప్పుడూ ఇండియాను పాక్ ఓడించలేదు. టీ20 వరల్డ్ కప్ లలో 8సార్లు తలపడగా.. ఒక్కసారి మాత్రమే పాక్ గెలిచింది. మరి ఈసారి వరల్డ్ కప్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version