Site icon janavahinitv

హైదరాబాద్‌కు దగ్గరలో ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు మంచి టూరిస్ట్ ప్లేస్ ఇదే, తెలంగాణ ఊటీ ఇది-gottam gutta is a good tourist place to go with family near hyderabad in summer vacation ,లైఫ్‌స్టైల్ న్యూస్

Summer trip in Hyderabad: హైదరాబాద్ చుట్టుపక్కల పచ్చదనం నిండిన ప్రాంతాల కోసం వెతుకుతున్నారా? అయితే ఓసారి గొట్టం గుట్టకు వెళ్ళండి. ఉదయం వెళితే సాయంత్రానికి ఇంటికి వచ్చేయొచ్చు. రోజంతా కుటుంబంతో అక్కడ హాయిగా గడపవచ్చు. దీన్ని చూస్తే ఊటీ గుర్తుకొస్తుంది. గొట్టం గుట్టను తెలంగాణ ఊటీ అని కూడా పిలుచుకోవచ్చు. ఈ చల్లని ప్రదేశంలో నిండుగా చెట్లు, పారే జలపాతం కంటికి ఇంపుగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరితే రెండు గంటల్లో అక్కడికి చేరుకుంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత అందమైన ప్రాంతం ఉందంటే మీరు కూడా నమ్మరు….అంత అందంగా ఉంటుంది ఈ గొట్టం గుట్ట.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి కారు లేదా బస్సులో ముందుగా జహీరాబాద్ కు చేరుకోవాలి. జహీరాబాద్ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గొట్టం గుట్ట. రెండు మూడు రోజులు ఈ గొట్టం గుట్టలో విహరించాలనుకుంటే జహీరాబాద్ లోని హోటల్ లో వసతి బుక్ చేసుకోవాలి. లేదా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేస్తాం అనుకుంటే కారు మీద వెళ్లడం మంచిది. హైదరాబాద్ నుంచి ఈ గొట్టం గుట్ట ప్రాంతానికి వెళ్లి ఒక్కరోజులో వచ్చేయవచ్చు.

గొట్టం గుట్టలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రకృతి ఒడిలో నిదురుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా పచ్చని అందాలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. అడవి మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరు. ఈ ప్రాంతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధికంగా వస్తూ ఉంటారు. తెలంగాణకు కర్ణాటకకు సరిహద్దుల్లో ఉన్న గ్రామం గొట్టం గుట్ట.

ఈ ప్రాంతంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే చించోలి అభయారణ్యం ఉంది. శివాలయం, విగ్నేశ్వరాలయం, భవానీ మాత ఆలయం పర్యటకులకు నచ్చుతాయి. శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించే శ్రీ గురు గంగాధర భక్త ప్రభూ దేవస్థానం ఇక్కడ ఉంది. ఎంతోమంది ఈ అడవిలో ఉన్న దేవాలయాలకు వెళతారు. దీన్ని రెండో శ్రీశైలం గా పిలుచుకుంటారు.

గొట్టం గుట్ట నుంచి పది కిలోమీటర్లు ప్రయాణిస్తే మల్కాపూర్ జలపాతం వస్తుంది. ఈ జలపాతాన్ని ఎంత చూసినా తనివి తీరదు. లోతైన లోయలు పర్యాటకలను ఆకర్షిస్తాయి. చుట్టూ ఎత్తైన కొండలు మరొక ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడికి దగ్గరలోనే చంద్రగిరి అని పిలిచే డ్యాం కూడా ఉంది. గొట్టం గుట్టకు వెళ్లేవారు చంద్రగిరి డ్యామ్ ను కూడా చూసుకొని వస్తారు. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీతో ఒక్కరోజులో హైదరాబాదు నుంచి ఏదైనా అందమైన ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఒకసారి ఈ గొట్టం గుట్ట ప్రాంతానికి వెళ్లి చూడండి. మీకు ఎన్నో మధురాను బదులు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

Exit mobile version