Site icon janavahinitv

PKL Telugu Titans: ప్రొ కబడ్డీ లీగ్.. సీజన్ మధ్యలోనే కోచ్‌పై వేటు వేసిన తెలుగు టైటన్స్

PKL Telugu Titans: ప్రొ కబడ్డీ లీగ్.. సీజన్ మధ్యలోనే కోచ్‌పై వేటు వేసిన తెలుగు టైటన్స్

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 12:51 PM IST

PKL Telugu Titans: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) తాజా సీజన్ లో దారుణమైన ప్రదర్శన చేస్తున్న తెలుగు టైటన్స్ టీమ్.. తమ కోచ్ పై వేటు వేసింది. సీజన్ కొనసాగుతుండగానే కొత్త కోచ్ ను తీసుకొచ్చింది.

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ మధ్యలోనే కోచ్ పై వేటు వేసి కొత్త కోచ్ కేకే హుడాను తీసుకొచ్చిన తెలుగు టైటన్స్

PKL Telugu Titans: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటన్స్ రాత ఈ సీజన్లోనూ మారలేదు. పైగా ఈసారి మరింత దారుణమైన ప్రదర్శన చేసింది. గత మూడు సీజన్లలో టేబుల్లో చివరి స్థానంలో నిలిచిందా టీమ్. ఈసారి కూడా ఆడిన 22 మ్యాచ్ లలో 19 ఓడి కేవలం రెండు గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. దీంతో సీజన్ కొనసాగుతుండగానే కోచ్ శ్రీనివాస్ రెడ్డిపై ఫ్రాంఛైజీ వేటు వేసింది.

ట్రెండింగ్ వార్తలు

తెలుగు టైటన్స్ కొత్త కోచ్ కేకే హుడా

తెలుగు టైటన్స్ ఈ ఏడాది కూడా దారుణమైన ప్రదర్శన చేయడంతో ఇప్పటి వరకూ ఉన్న కోచ్ ను తొలగించి కేకే హుడాను కొత్త కోచ్ గా తీసుకొచ్చింది. 2021-22 సీజన్ లో దబంగ్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ అతడు. దీంతో కనీసం అతని కోచింగ్ లో అయినా వచ్చే సీజన్ లో తెలుగు టైటన్స్ రాణిస్తుందని ఆ ఫ్రాంఛైజీ ఆశగా ఉంది.

నిజానికి ఈ సీజన్ లోనే ఆ టీమ్ మెరుగ్గా రాణించాల్సింది. ఎందుకంటే ఏకంగా ఇండియన్ కబడ్డీ టీమ్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతనితోపాటు పర్వేష్ భైన్స్వాల్, సందీప ధుల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అయినా కూడా తెలుగు టైటన్స్ టీమ్ ఈ తాజా సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. కనీస పోటీ లేకుండా ఏకంగా 19 మ్యాచ్ లలో ఓడిపోవడం ఎవరికీ మింగుడు పడటం లేదు.

ఈ కారణంగానే కోచ్ శ్రీనివాస్ రెడ్డికి ఉద్వాసన పలకాలని యజమానులు నిర్ణయించారు. కొత్త కోచ్ కేకే హుడా గతంలో ద్రోణాచార్య అవార్డు కూడా అందుకున్నాడు. కోచ్ మార్పు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఓనర్స్ అనౌన్స్ చేశారు.

“కష్టనష్టాల్లోనూ మాకు అండగా నిలిచిన టైటన్స్ ఆర్మీకి కృతజ్ఞతలు. తాజా సీజన్ మేము అనుకున్నట్లగా సాగలేదు. మా లక్ష్యాలకు దూరంగా ఉండిపోయాం. మీ నిరాశను మేము అర్థం చేసుకోగలం. కానీ ఇదే ముగింపు కాదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓ కొత్త అధ్యాయాన్ని అనౌన్స్ చేస్తున్నాం.

జట్ల జాతకాలను మార్చి వాటిని లీడర్ బోర్డులో టాప్ లోకి తీసుకెళ్లే కొత్త హెడ్ కోచ్ ను తీసుకొస్తున్నాం. ద్రోణాచార్య అవార్డీ మిస్టర్ కృష్ణన్ కుమార్ హుడా ను టైటన్స్ కొత్త కోచ్ గా తీసుకున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం” అని టైటన్స్ టీమ్ వెల్లడించింది.

ప్రొ కబడ్డీ లీగ్ సెమీఫైనల్స్

ప్రొ కబడ్డీ లీగ్ రెండు నెలలకుపైగా అలరించి ఇప్పుడు సెమీఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. బుధవారం (ఫిబ్రవరి 28) నుంచి సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. బుధవారం రాత్రి 8 గంటలకు పుణెరి పల్టన్స్, పట్నా పైరేట్స్ మధ్య తొలి సెమీఫైనల్.. రాత్రి 9 గంటలకు జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 1న జరుగుతుంది. ఈ మ్యాచ్ లన్నీ హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి.

Exit mobile version