Chunduru Police Station Review: జోజు జార్జ్, కుంచకో బోబన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ నయట్టు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాను చండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఆహా ఓటీటీ తెలుగులోకి డబ్ చేసింది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించాడు. డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
చుండూరు రైల్వేస్టేషన్ కథ…
సునీత (నిమిషా సజయన్) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటుంది. బిజు అనే లోకల్ రౌడీతో సునీతకు గొడవలు ఉంటాయి. సునీతకు ఏఎస్ఐ మణియన్ (జోజు జార్జ్), కానిస్టేబుల్ ప్రవీణ్ మైఖేల్ (కుంచకోబోబన్) సపోర్ట్‌గా నిలుస్తారు. స్టేషన్‌కు వచ్చిన బిజును ప్రవీణ్, మైఖేల్ అరెస్ట్ చేస్తారు. అదే టైమ్‌లో ఆ ఏరియాలో ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. ఓ వర్గం వారి ఓట్ల కోసం బిజును సీఏం స్వయంగా రిలీజ్ చేయిస్తాడు. తనను అరెస్ట్ చేసిన ప్రవీణ్, మణియన్‌తో పాటు సునీతపై కోపంతో బిజు రగిలిపోతుంటాడు.
బిజు అసిస్టెంట్ జయన్ ఓ ప్రమాదంలో చనిపోతాడు. సీఏం ఒత్తిడితో మణియన్, ప్రవీణ్, సునీత కలిసి జయన్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఈ ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేయమని సీఏం స్వయంగా ఆదేశాలు జారీచేస్తాడు. పోలీసులకు దొరకకుండా ప్రవీణ్, మణియన్, సునీత తప్పించుకొని పారిపోతారు.
ఈ ముగ్గురిని పట్టుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ ఎస్‌పి అనురాధ రంగంలోకి దిగుతుంది? జయన్ ఎలా చనిపోయాడు? మణియన్, ప్రవీణ్, సునీతలకు అతడి హత్యతో ఎలాంటి సంబంధం ఉంది? పోలీసులకు దొరక్కుండా ఈ ముగ్గురు ఎక్కడికి పారిపోయారు? తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించడం తట్టుకోలేని మణియన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? రాజకీయ కుట్రలకు నిజాయితీపరులైన వారు ఎలా బలయ్యారు? అన్నదే చుండూరు పోలీస్ స్టేషన్ మూవీ కథ.
ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ…
మలయాళ భాషలో 2021లో రిలీజైన నయట్టు మూవీ పలు అవార్డులు అందుకోవడంతో కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయినా సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ఈ నయట్టు సినిమాను చండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఆహా ఓటీటీ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసింది.
ఓటు బ్యాంకు రాజకీయాలు…
ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఏ తప్పు చేయని ముగ్గురు కానిస్టేబుల్స్ జీవితాలు ఎలా అతలాకుతలం అయ్యాయి? రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టుకొని ఎలాంటి ఎత్తులు వేస్తారు? నాయకుల ఒత్తిడులకు కొన్నిసార్లు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఎలా బలిపశులుగా మారుతారు అన్నది ఆలోచనాత్మకంగా దర్శకుడు చుండూరు పోలీస్ స్టేషన్ మూవీలో చూపించాడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కథలో అంతర్లీనంగా తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరించాడు డైరెక్టర్.
రెగ్యులర్ పోలీస్ కథలకు భిన్నంగా…
రెగ్యులర్ పోలీస్ కథలకు పూర్తి భిన్నంగా చుండూరు పోలీస్‌స్టేషన్ సాగుతుంది. హీరో… పోలీస్ అనగానే లాజిక్‌లతో సంబంధం లేకుండా విలన్స్‌తో భారీ ఫైట్స్, ఛేజింగ్‌లు చేసినట్లుగా లార్జర్‌దేన్ లైఫ్ క్యారెక్టర్ అన్నట్లుగా చూపిస్తారు. కానీ ఇందులో అలాంటి సీన్స్ ఏవి ఉండదు.
వృత్తి నిర్వహణలో పోలీసుల ఎదుర్కొనే సంఘర్షణ ను అర్థవంతంగా ఆవిష్కరించారు. రౌడీలు కూడా తాము చేయాలనుకున్న పని చేస్తారు. కానీ పోలీసులకు మాత్రం ఆ స్వేచ్ఛ లేదు అనే డైలాగ్ డ్యూటీలో పోలీసులు పడే బాధలను చాటిచెబుతుంది.
నిరపరాధి అని తెలిసి కూడా మంత్రి బలవంతంతో ఓ యువకుడిపై మణియన్ అక్రమంగా కేసు పెట్టే సీన్ ద్వారా పోలీసులపై పొలిటీషియన్స్ ఒత్తిళ్లు ఎలా ఉంటాయన్నది చూపించారు. క్లైమాక్స్ సీన్ దర్శకుడి ప్రతిభకు అద్ధంపడుతుంది. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి నాయకులు తమ అధికారాన్ని ఏ విధంగా నిలుపుకుంటారన్నది చూపించిన సీన్ మెప్పిస్తుంది.
ఎమోషనల్ క్లైమాక్స్…
ప్రవీణ్, సునీత, మణియన్ పాత్రలతో నెమ్మదిగా కథ ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరి కుటుంబ కష్టాలను చూపిస్తూ అసలు కథలోకి వెళ్లడానికి టైమ్ తీసుకున్నాడు డైరెక్టర్. మర్డర్ కేసులో ప్రవీణ్, మణియన్, సునీత చిక్కుకున్న తర్వాతే కథ వేగం అందుకుంటుంది. వారిని పట్టుకోవడానికి పోలీసులు వేసే ఎత్తులతో చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌ను ఎమోషనల్‌గా ముగించారు.
పోటీ నటన…
చుండూరు పోలీస్ స్టేషన్ కథ మొత్తం జోజు జార్జ్, కుంచకో బోబన్, నిమిషా సజయన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ముగ్గురు పోటీపడి తమ పాత్రలకు న్యాయం చేశారు. చేయని నేరానికి శిక్షను అనుభవిస్తూ మనోవేదనను అనుభవించే పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు.
తెలుగు రీమేక్ చూడని వారికి…
చండూరు పోలీస్ స్టేషన్ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. తెలుగులో కోటబొమ్మాళి పీఎస్ పేరుతో ఈ మూవీ రీమేకైంది. తెలుగు వెర్షన్ చూడని వారికి ఈ మలయాళ వెర్షన్ బాగా నచ్చుతుంది.