Aloo Masala Sandwich: ఉదయం పూట దోశ, ఇడ్లీ, ఉప్మా లాంటి బ్రేక్ ఫాస్ట్ లోనే అధికంగా తింటాము. పిల్లలకు ప్రతిరోజూ ఇవే పడితే వారికి బోర్‌గా అనిపించవచ్చు. ఒకసారి ఆటూ మసాలా సాండ్‌విచ్ చేసి చూడండి. దీన్ని చేయడం చాలా సులువు. పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది. దీని రెసిపీ ఇక్కడ మేము ఇచ్చాము. ఇలా ఫాలో అయిపొయింది.
ఆలూ మసాలా సాండ్‌విచ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు – నాలుగు
ఉడికించిన బంగాళదుంప – ఒకటి
ఉడికించిన బఠానీలు – పావు కప్పు
మిరియాల పొడి – పావు స్పూను
చాట్ మసాలా – అర స్పూను
గరం మసాలా పొడి – పావు స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
టమోటా కెచప్ – రెండు స్పూన్లు
ఉల్లిపాయ – ఒకటి
పుదీనా చట్నీ – రెండు స్పూన్లు
ఆలు మసాలా సాండ్‌విచ్ రెసిపీ
1. బంగాళదుంపను ముందుగానే ఉడికించి పెట్టుకోండి.
2. అలాగే బఠానీలను కూడా ఉడికించి రెడీగా ఉంచుకోండి.
3. పుదీనా చట్నీ చేసి పక్కన పెట్టుకోండి.
4. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపను చేత్తో బాగా నలిపి పెట్టండి.
5. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉడికించిన బఠానీలు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసి చేతితోనే బాగా కలపండి.
6. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఒక స్లైస్ పై కెచప్ ను పూయండి.
7. మరొక బ్రెడ్ ముక్క పై పుదీనా చట్నీ పూయండి.
8. ఆ రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసి… ఆ రెండు బ్రెడ్ ముక్కలను సాండ్‌విచ్ లాగా చేత్తో నొక్కండి.
9. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి బటర్ ను వేసి ఈ సాండ్‌విచ్ ను రెండు వైపులా కాల్చండి.
10. అంతే టేస్టీ ఆలూ మసాలా సాండ్‌విచ్ రెడీ అయినట్టే.
11. దీన్ని వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. ఇందులో ఉల్లిపాయలు, మిరియాల పొడి, బంగాళదుంప, బఠానీలు వంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని వేశాము. కాబట్టి వారికి పొట్ట నిండడంతో పాటు పోషకాలు అందుతాయి. పిల్లలకు ఇలాంటి సాండ్‌విచ్ రెండు నుంచి మూడు పెడితే చాలు. పొట్ట త్వరగా నిండిపోతుంది. దీన్ని చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కాబట్టి వారంలో ఒకటి రెండుసార్లు పిల్లలకు పెడితే వారికి కచ్చితంగా నచ్చుతుంది.