Shruti Haasan Break up: టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించే ముద్దుగుమ్మ శృతి హాసన్ మళ్లీ సింగిల్ స్టేటస్ లోకి వచ్చేసింది. చాన్నాళ్లుగా ఉన్న తన రిలేషన్షిప్ లో నుంచి బయటకు వచ్చేసింది. తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాకు బ్రేకప్ చెప్పేసినట్లు వస్తున్న వార్తలు నిజమే అని తేలింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసేసుకున్నారు.
శృతి హాసన్ బ్రేకప్
కమల్ హాసన్ ముద్దుల తనయ శృతి హాసన్ చాలా రోజులుగా శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్ట్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లికి రెడీ అయినట్లూ వార్తలు వచ్చాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో శృతి తండ్రి కమల్ తోనూ శాంతను ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే వీళ్లు బ్రేకప్ చెప్పేసుకున్నట్లు ఈ మధ్య వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయి.
మొదట ఇన్‌స్టాగ్రామ్ లో శాంతను హజారికాను శృతి అన్‌ఫాలో చేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అంతేకాదు తన అకౌంట్లో అతనితో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ ఆమె డిలీట్ చేసింది. దీంతో వీళ్లు విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. అవి నిజమేనని శృతి సన్నిహిత వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ తో తెలిపాయి.
“గత నెలలోనే వాళ్లు విడిపోయారు. తామిద్దరం కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తర్వాత పరస్పర అంగీకారంతో వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు” అని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇదే విషయంపై నేరుగా శృతి హాసన్ ను సంప్రదించగా.. తన వ్యక్తిగత జీవితంపై స్పందించడానికి ఆమె నిరాకరించింది.
నెల రోజుల ముందే..
ఈ ఇద్దరూ నెల రోజుల నుంచే ఒకరినొకరు కలుసుకోవడం లేదు. అయితే ఈ మధ్యే శృతి హాసన్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి శాంతను ఫొటోలు డిలీట్ చేయడంతో వీళ్ల బ్రేకప్ వార్తలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు కొన్నాళ్లు ఆమె సోషల్ మీడియా నుంచి కూడా బ్రేక్ తీసుకుంది. అయితే తిరిగి వచ్చిన తర్వాత ఆమె చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది.
“ఇదో వింత ప్రయాణం. ఈ మధ్య నా గురించి, వ్యక్తుల గురించి చాలా తెలుసుకున్నాను. మనం ప్రతి విషయానికి బాధపడాల్సిన అవసరం లేదు” అని శృతి హాసన్ ఓ పోస్ట్ చేసింది. ఈ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారానే అప్పట్లో దగ్గరయ్యారు. తర్వాత నేరుగా మెసేజ్‌లు పంపించుకోవడం మొదలుపెట్టారు. అది కాస్తా మెల్లగా ప్రేమగా మారి.. ఇన్నాళ్లకు బ్రేకప్ వరకూ వెళ్లింది.
శృతి హాసన్ గతేడాది ప్రభాస్ తో కలిసి సలార్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి ఇనిమేల్ అనే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అందులో లోకేష్ తో శృతి రెచ్చిపోయి చేసిన రొమాంటిక్ సీన్లు వైరల్ అయ్యాయి. ఇక సలార్ 2, చెన్నై స్టోరీ సినిమాల్లో ఆమె నటించాల్సి ఉంది.