కామారెడ్డి నవంబర్ 11 (జనవాహిణి ప్రతినిధి):- ఈ నెల 12 నుంచి అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీల సభ్యులను గ్రామ సభ ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని సూచించారు. ఈ కమిటీలో 2/3 ఎస్టీలు,1/3 మహిళలు ఉండే విధంగా చూడాలన్నారు. ఎస్టీలు లేని గ్రామాలలో 1/3 మహిళలు తప్పనిసరిగా ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. ప్రతి హ్యాబిటేషన్ లో అటవీ హక్కుల కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2005 కంటే ముందు అటవీ భూమిలో సాగు చేస్తున్న వారు, మూడు తరాలుగా అటవీ భూమిలో వ్యవసాయం చేస్తున్న వారు గ్రామ సభలు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. అటవీ హక్కుల కమిటీ తీసుకున్న దరఖాస్తులను రిజిస్టర్లో నమోదు చేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి రసీదును అందజేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల నుంచి అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు నకలు దరఖాస్తుకు జత చేయాలని పేర్కొన్నారు. అటవీ హక్కుల కమిటీ కార్యదర్శిగా చదువుకున్న వ్యక్తులను ఎంపిక చేయాలని చెప్పారు. ఆధారాలు సక్రమంగా లేకపోతే దరఖాస్తులను గ్రామస్థాయిలో తిరస్కరణ చేయవచ్చని సూచించారు. మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులకు అటవీ హక్కుల కమిటీ విధులు, బాధ్యతలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఎఫ్వో నిఖిత, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జెడ్ పి సీఈవో సాయగౌడ్, అధికారులు పాల్గొన్నారు.