• ధోనీ బయోపిక్ తో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ రాజ్ పుత్
  • సుశాంత్ ఆత్మహత్య విషయాన్ని ధోనీకి తెలిపిన దర్శకుడు నీరజ్ పాండే
  • ధోనీకి గుండె పగిలినంత పనైందన్న పాండే

నాలుగేళ్ల కిందట వచ్చిన ధోనీ బయోపిక్ ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ చిత్రం ఓ కమర్షియల్ సినిమా స్థాయిలో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది. ఈ సినిమాతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు మార్మోగిపోయింది. అయితే అది గతం. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. నిన్న ముంబయిలో తన నివాసంలోఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత ధోనీ వెంటనే స్పందిస్తాడని చాలామంది భావించినా, ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, సుశాంత్ ఆత్మహత్య విషయాన్ని ధోనీకి దర్శకుడు నీరజ్ పాండే ఫోన్ ద్వారా తెలియజేశాడు.

సుశాంత్ ఇక లేడన్న సంగతి తెలిసి ధోనీ తీవ్రంగా కలత చెందాడని, దిగ్భ్రాంతికి గురయ్యాడని పాండే వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్యతో ధోనీకి గుండె పగిలినంత పనైందని అన్నారు. అటు, నీరజ్ పాండే ద్వారానే సుశాంత్ మరణవార్త తెలుసుకున్న ధోనీ ఏజెంట్ అరుణ్ పాండే సైతం ఎంతో బాధపడ్డాడు. ధోనీ పరిస్థితి గురించి చెబుతూ, ఈ వార్త విన్నప్పటి నుంచి ధోనీ తీవ్ర విచారంతో కనిపించాడని, అసలేం జరిగిందో నమ్మలేకపోతున్నామని అరుణ్ పాండే వెల్లడించారు. నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన ఎంఎస్ ధోనీ బయోపిక్ కు అరుణ్ పాండేనే నిర్మాత.