• అవసరం ఉంటేనే బయటికి రావాలన్న సీఎం కేసీఆర్
  • మాస్కు లేకపోతే రూ.1000 జరిమానా
  • ప్రజలు సహకరిస్తున్నారని కితాబు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణలోనూ లాక్ డౌన్ పై ప్రకటన చేశారు. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోనూ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వదిలిపెట్టాం కదా అని చెప్పి రోడ్లపైకి వచ్చి హంగామా చేయొద్దని ప్రజానీకానికి హితవు పలికారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని, కొంచెం నియంత్రణ పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని, స్వీయ నియంత్రణ అవసరమని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నపిల్లలను బయటికి రానివ్వరాదని అన్నారు. ఇప్పటివరకు ప్రజలు ఎంతో సహకరించారని, కొన్ని ఆంక్షలు విధించాల్సి వచ్చినా ప్రజలు అర్థం చేసుకున్నారని కొనియాడారు.

ఇక, రాష్ట్రంలో విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుందని, స్కూళ్లైనా, కాలేజీలైనా, కోచింగ్ సెంటర్లైనా మూతపడతాయని తెలిపారు. బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు, జిమ్నాజియంలు, క్రీడా సముదాయాల మూసివేత కొనసాగుతుందని, మెట్రో రైల్ వ్యవస్థ కూడా నడవదని అన్నారు. కర్ఫ్యూ యధాతథంగా అమల్లో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కాటన్ తో తయారైనదో, మరేదైనా సరే ఏదో ఒక మాస్కు ధరించాల్సిందేనని, లేకపోతే రూ.1000 ఫైన్ తప్పదని హెచ్చరించారు. ప్రతి దుకాణంలో శానిటైజర్లు ఉండాలని, నిత్యం షాపులో శానిటైజేషన్ చేయడంతో పాటు రసాయనాలు పిచికారీ చేయించుకోవాలని సూచించారు.