ఎన్నాళ్ల‌కు ఎన్నేళ్ల‌కు ఇండియ‌న్ విమెన్స్ క్రికెట్ టీం ఫైన‌ల్ కు రావ‌డం. ఒక‌ప్పుడు వాళ్లు ఆడుతున్నారంటే ప‌ట్టించుకునే వాళ్లం కాదు. క‌పిల్ దేవ్, అజారుద్దీన్, స‌చిన్, గంగూలీ నుంచి నేటి కోహ్లి దాకా అంతా వాళ్ల గురించిన చ‌ర్చ‌నే. ఇదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా హైద‌రాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ వ‌చ్చాక భార‌త‌దేశంలో మ‌హిళా క్రికెట్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగేలా చేసింది. క్రికెట్ అంటేనే పురుషుల‌కు మాత్ర‌మే చెందింద‌ని అనుకునే రోజుల నుంచి ఇపుడు ప్ర‌పంచ‌మంతా మ‌హిళ‌లు కూడా ధీటుగా, ధాటిగా ఆడ‌గ‌ల‌ర‌ని నిరూపించారు. దీంతో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏకంగా వారి కోసం ప్ర‌త్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. వాళ్ల‌కు కాంట్రాక్టు సిస్టం ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. గంగూలీ బీసీసీఐ చీఫ్ అయ్యాక క్రికెట్ ఆట‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పాల‌నా ప‌రంగా కొత్త పుంత‌లు తొక్కించాడు ఈ మాజీ క్రికెట‌ర్. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి నుంచి అంతా మ‌న మ‌హిళా జ‌ట్టు గెల‌వాల‌ని కోరుకున్న వారే.
కానీ సీన్ రివ‌ర్స్ అయింది. ఇండియా జ‌ట్టు భారీ తేడాతో ఓడిపోయింది. దీనికి బాధ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్న ఇండియ‌న్ క్రికెట్ ప్ర‌పంచానికి వీళ్లు ఆ మాత్రం ఫైన‌ల్ కు వెళ్ల‌డం ఓ అసాధార‌ణ‌మైన విజ‌యంగానే అభివ‌ర్ణించ‌క త‌ప్ప‌దు. ఎవ్వ‌రి స‌పోర్ట్ లేకుండానే ఈ మాత్రం ప‌ర్ ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించ‌డం మంచిదే. భ‌విష్య‌త్‌లో యూత్ క్రికెట్ ఆట‌పై మ‌రింత మ‌క్కువ పెంచుకునేలా చేసింది. బిసిసిఐ ఈ మేర‌కు వీరికి కూడా కాంట్రాక్టు సిస్టంను ప్ర‌వేశ పెట్టాక‌..కొంచెం డిమాండ్ పెరిగింది మార్కెట్ లో. అంతే కాకుండా బ‌డా కంపెనీలు సైతం మ్యాచ్‌ల‌ను స్పాన్స‌ర్ చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఇందులో ఎక్కువ‌గా కార్పొరేట్ కంపెనీలు ఉండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.
ఏది ఏమైనా ఇపుడు దేశ‌మంతటా మ‌న మ‌హిళా క్రికెట‌ర్లకు మ‌రింత ప్రోత్సాహం ఇవ్వాలని ప‌లువురు క్రికెట‌ర్లు కోరుతున్నారు. ఈ దేశంలో ఎంతో మంది మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో త‌మ‌దైన ప‌ద్ధ‌తుల్లో రాణిస్తున్నారు. టెన్నిస్ , బ్యాడ్మింట‌న్, హాకీ, చెస్, త‌దిత‌ర ఆట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మ‌రో వైపు విమెన్స్ క్రికెట్ విష‌యానికి వ‌స్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న‌టి దాకా స్పాన్స‌ర్ షిప్స్ దొర‌కక నానా తంటాలు ప‌డ్డారు. మిథాలీ రాజ్ , డ‌యానా ఎడుల్జీ, త‌దిత‌ర మ‌హిళా ఆట‌గాళ్ల కృషి వ‌ల్ల నేడు మ‌హిళా క్రికెట్‌కు జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది. వీరికి కూడా పురుషుల‌తో ఉన్న‌ట్టే టీ20తో పాటు అడ‌పా ద‌డ‌పా ఐపీఎల్, వ‌న్డే, టెస్ట్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తూ వుంటే మ‌రింత ప్రాక్టిస్ అవుతుంది. అలాగే క్రికెట్‌లో మ‌రింత రాటుదేలేలా వీరికి ప్ర‌త్యేకంగా అనుభ‌వం క‌లిగిన కోచ్ ను ఏర్పాటు చేసిన‌ట్ల‌యితే మంచి ఫ‌లితాలు ఆశించ‌వ‌చ్చు. మొత్తం మీద మ‌న మ‌హిళా ఆట‌గాళ్ల‌కు కావాల్సింది కాసులు కాదు దేశం నుంచి మ‌రింత స‌పోర్ట్. ఇందు కోసం రాహుల్ ద్ర‌విడ్, అజారుద్దీన్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్ల సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకోవ‌డం..వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కోచ్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం..ప్ర‌త్యేకించి కేవ‌లం మ‌హిళ‌ల కోసం మాత్ర‌మే క్రికెట్ అకాడెమీల‌ను ఏర్పాటు చేస్తే టీమిండియా దేశం కోరుకునే స్థాయిలో విజ‌యాలు సాధించేందుకు వీల‌వుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here