• భోపాల్ రైల్వే స్టేషన్ లో ఘటన
  • బిడ్డకు పాలు కావాలని రైల్వే పోలీసును కోరిన ప్రయాణికురాలు
  • రైలు కదలడంతో వేగంగా పరుగెత్తి మహిళకు పాలు అందించిన పోలీసు
  • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వైనం

తన పసి బిడ్డ ఆకలి తీర్చాలన్న తల్లి తాపత్రయం ఆ రైల్వే పోలీసును చిరుతలా ముందుకు ఉరికించింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళుతున్న ఓ రైలు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఆగింది. ఆ రైలులో పసిబిడ్డతో పాటు ఓ మహిళ ప్రయాణిస్తోంది. బిడ్డకు పాలు అయిపోవడంతో ప్లాట్ ఫాంపై ఉన్న రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ ను సాయం కోరింది. అయితే ఇందర్ యాదవ్ పాల ప్యాకెట్ తెచ్చేలోపే రైలు కదిలింది. అయితే, ఆ పసిబిడ్డ ఆకలి, తల్లి వేదన గుర్తు తెచ్చుకున్న ఇందర్ యాదవ్ రైలు వెంబడి చిరుతలా పరుగెత్తాడు.

భుజానికి బరువైన రైఫిల్ వేళ్లాడుతున్నా వెనుదీయకుండా, తన శక్తిమేర ఓ మహిళ ఉన్న బోగీ వెంట పరుగులు తీశాడు. చివరికి పాలను ఆ తల్లికి అందించి తన పరుగును ఆపాడు. స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.

కాగా, తన స్వస్థలం చేరుకున్న ఆ మహిళ రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఒక హీరోలాగా తన బిడ్డ ఆకలి తీర్చాడని, పాలు లేకపోవడంతో బిడ్డకు నీళ్లలో ముంచిన బిస్కెట్లు తినిపించాల్సిన అగత్యం నుంచి తప్పించారని కొనియాడింది. ఈ ఘటన రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి వెళ్లడంతో, రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ ను అభినందించారు. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.